ఆశల రైలు వచ్చేస్తోంది
Sakshi | Updated: February 09, 2015 06:52 (IST)
ఆశల రైలు వచ్చేస్తోంది
పాతపట్నం:దశాబ్దాల కల నెరవేరనుంది. శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశా ప్రయాణికుల డిమాండ్ మరికొన్ని గంటల్లో పట్టాలెక్కనుంది. సోమవారం నుంచి విశాఖ-గుణుపూర్ పాసింజర్ రైలు సేవలు ప్రారంభమవుతున్నాయి. నౌపడ-గుణుపూర్ నేరో గేజ్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చినప్పటి నుంచి ఈ మార్గంలో కొత్త రైళ్లు నడపాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. విశాఖ నుంచి గుణుపూర్‌కు పాసింజర్ రైలు నడిపితే మంచి ఆదాయం లభించడంతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, ఒడిశాలోని గుణుపూర్ ప్రాంతం అనుసంధానమవుతాయి....
more... ఒడిశాలోని గుణుపూర్, పర్లాకిమిడి ప్రాంతాల నుంచి వేలాదిమంది నిత్యం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. అటువంటి వారికి ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
అయితే రైల్వే శాఖ మాత్రం ఇప్పటివరకు నౌపడ-గుణుపూర్ పాసింజర్తోనే సరిపెట్టింది. 2012 రైల్వే బడ్జెట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖనుంచి నౌపాడ మీదు గా గుణుపూర్‌కు కొత్త పాసింజర్ రైలు నడుపుతామని ప్రకటించింది. దాంతో మరో రైలు అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఎంతో సంతోషించారు. సంబరాలు చేసుకున్నారు. రెండేళ్లు గడిచినా ఆ రైలు రాలేదు. ఇక దానిపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో అధికారులు కరుణించారు. విశాఖ-గుణుపూర్ పాసింజర్ రైలు నడిపేందుకు రంగం సిద్ధం చేశామని, ఈనెల 9న ఆ రైలు పట్టాలెక్కుతుందని ప్రకటన చేయడంతో ఈ ప్రాంత ప్రజల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. సోమవారం విశాఖలో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త రైలుకు ఘనస్వాగతం పలికేందుకు జిల్లాలోని ప్రజలు సిద్ధమవుతున్నారు.
రైలు వేళలివే..
ప్రతిరోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు గుణుపూర్ చేరుతుంది. మార్గమధ్యంలో శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు 9.20 గంటలకు, పాతపట్నానికి 12 గంటలకు వస్తుంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.25 గంటలకు గుణుపూర్‌లో బయులుదేరి రాత్రి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. మార్గమధ్యంలో పాతపట్నానికి 4.10 గంటలకు, శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు 6.35 గంటలకు వస్తుంది.
ప్రయాణ భారం తగ్గుతుంది
వారంలో రెండు మూడు రోజులు విశాఖపట్నం వెళుతుంటాం. బస్సులో వెళ్లాలంటే చార్జీల భారంతోపాటు సమయం వృథా అవుతోంది. దీంతో ప్రయాణం చేయాలంటే భయమేస్తుంది. ఎన్నాళ్ల నుంచో ఈ రైలు కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రో జు వస్తుందని పేపర్లో చదివిన తరువాత ఆనందంగా ఉంది. - ఎ.రాము, పాతపట్నం